బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి

  • బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి
  • రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 
  • కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ శాసనసభా పక్షం సామ్రాట్ చౌదరిని తమ పార్టీ నేతగా ఎన్నుకుంది. దీనితో ఆయన రేపు ప్రమాణం చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఎన్నిక కోసం పరిశీలకుడిగా వచ్చారు.

1990లో ఆర్జేడీలో సామ్రాట్ చౌదరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1999లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన జేడీయూలో చేరారు. అనంతరం ఆయన బీజేపీలో చేరగా, కొన్నాళ్లకే 2018లో బీహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023 మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి బీజేపీ నేతగా ఆయన నిలవనున్నారు. ఆయన కుష్వాహా వర్గానికి చెందిన నాయకుడు.

బీహార్‌లో యాదవుల తర్వాత కుష్వాహాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. బీహార్‌లో ఇప్పటి వరకు ఈ వర్గానికి చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలేదు. సామ్రాట్ చౌదరిని పెద్ద నాయకుడిగా చేస్తానని బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలో తొలుత ఉపముఖ్యమంత్రిగా చేశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Samrat Choudhary
Bihar Chief Minister
Bihar Politics
BJP Leader
Nitish Kumar
Shivraj Singh Chouhan

More Telugu News